Monday, November 11, 2013

పేరిణీ శివతాండవ చక్రవర్తి - చాణక్య




"ప్రాణం ఖరీదు" నవలని, నా దివంగత మిత్రుడు చాణక్య స్మృతికి అంకితమిచ్చానుగా...మా స్నేహం, ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మాట...

(వివరాలు ఈ క్రింది టపా లో:

http://nanduri-srinivas.blogspot.in/search/label/pranamkharidu )

క్రితం వారం, అనుకోకుండా విశాఖపట్టణం వెళ్ళవలసి వచ్చింది...అప్పుడు చిత్రంగా చాణక్య పేరెంట్స్ ని కలిశాను.



అపురూపమైన ఆ కొడుకుని తల్చుకుని, క్షణక్షణం చెమర్చిన వాళ్ళ కన్నీటి తెరల వెనుక, తాండవిస్తూన్న నా మిత్రుణ్ణి చూసుకుని చాలా బాధపడ్డాను.

ఇప్పుడే రంగుల అద్దిన తైలవర్ణ చిత్రంలా, ఇప్పటికీ వాళ్ళ గుండెల్లో తడి ఆరకుండా ఉన్న అతడి జ్ఞాపకాలని చూసి, మనస్సు చివుక్కుమంది.

ప్రియమిత్రుడి మరణం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి...తొందర్లోనే "ప్రేమేనేరమౌనా..." అనే నవల్లో వాటిని పొందుపరచాలని చూస్తున్నాను. అలాగే, చాణక్య పేరుమీద, వాళ్ళు ఒక సంస్థని స్థాపించి ఏటా అద్భుతమైన కార్యక్రమాల్ని నిర్వహించి, ఒక నృత్య కళాకారుణ్ణి గుర్తించి సన్మానిస్తున్నారు...త్వరలోనే చాణక్య ఫోటోలూ, వీడియోలూ, మిగితా వివరాలతో ఒక బ్లాగు సృష్టించి, ఆ వివరాలు ఇక్కడ తెలియచేస్తాను...

అప్పటివరకూ...

తన అపూర్వ పేరిణీ నృత్య పారవశ్య ప్రవాహంలో, ఈశ్వరుడి పాదాలని అభిషేకించి, ఆ సన్నిధిలోనే పూజా కుసుమంగా ఒదిగిపోయిన నా మిత్రుడి అందమైన ఫోటోని ఇక్కడ ఇస్తున్నాను...చూసి ఆనందించండి!