Friday, February 11, 2011

నీడ - సూపర్‌నాచురల్ థ్రిల్లర్



గర్భాలయం డిటెక్టివ్ నవల రాస్తూండగా, ఓరోజు పొద్దున్నే మా ఆవిడ సడన్‌గా, "మీరో దెయ్యం నవల ఎందుకు రాయకూడదూ...?" అనడిగింది.
"దెయ్యం నవలా, నా బొంద...నాకంత సీనుందా...? అయినా గురువుగారు (యండమూరిగారు) అలాంటివి చాలా రాస్సేరుగా...మనం రాస్తే మాత్రం ఎవరైనా చదువుతారా? " అన్నాన్నేను.
"ఆయన రాసింది చేతబళ్ళు గురించి...నేనడుగుతున్నది, దెయ్యాలూ ఆత్మలూ గురించి...రాయకపోతే దెయ్యమై పీడిస్తా..." అంది ;)

ఆ రోజే నేను ఆఫీసుకెళ్తూ, కార్లో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి "సౌందర్య లహరి " ప్రవచనం వింటున్నా. సరిగ్గా "కిరంతీమంగేభ్యః కిరణ నికురుంబాంమృత రసం..." అనే శ్లోకం వింటున్న క్షణంలో, ఒక క్లైమాకు తట్టింది...వెంటనే నవల రాయాలని సంకల్పం కల్గింది...కేవలం హారర్ కధ కాకుండా, సైన్సునీ స్పిరుట్యువలిజాన్నీ సమన్వయ పరుస్తూ రాద్దామనిపించింది!

సరిగ్గా అదే సమయంలో స్వాతి లో పదహారు వారాల సీరియల్ పోటీ పడి, ఇంక గడువుకి పదే రోజులుంది...అహోరాత్రాలూ కూర్చుని, ఏడు రోజుల్లో ఈ సీరియల్ పూర్తిచేసి పంపాను...వెంటనే సెలక్టయ్యి, ఆ పోటీలో బహుమతొచ్చింది.

25-jan-2011 నుంచీ June 1 వరకూ, ఈ నవల స్వాతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది!

నిజానికి, ఈ నవలకి " మాయ " అనే పేరు పెట్టాను (ఆ పేరు ఈ నవలకి చాలా యాప్ట్ కూడా...పూర్తిగా చదివాకా మీరే ఒప్పుకుంటారు) కానీ, నాకు బహుమతి వచ్చిన మూడు నెలల తరువాత, శ్రీ సూర్యదేవర రామ్మోహన రావుగారు, అదే పేరుతో ఇంకో సీరియల్ ప్రారంభించారు. అందువల్ల, దీని పేరు మార్చక తప్పలేదు.ఇప్పటికీ నాకైతే మాత్రం, ఆ అసలు పేరు మీదకే మనస్సు లాగుతూ ఉంటుంది!

ఈ సీరియల్ విషయంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు:

1. తన అమూల్య గ్రంధాల ద్వారా ఎన్నో మహత్తర విషయాలని ప్రపంచానికి అందించిన మా మావయ్యగారూ పూజ్య గురుదేవులూ, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారికీ (Master EK)...

2. చిన్నప్పట్నుంచీ సైన్సునీ, ఆధ్యాత్మికతనీ సమన్వయ పరుస్తూ ఎన్నో విషయాలు చెప్పి, ఈ సీరియల్లో దీక్షితులవారి పాత్రకి + నా సాహితీ జీవితానికీ ప్రాణం పోసిన మా నాన్నగారికీ...

3. నా సాహితీ ప్రస్థానంలో అడుగడుగునా సహకరిస్తూ, నా రచనలన్నిటికీ తొలి పాఠకురాలు + విమర్శకురాలూ అయిన నా శ్రీమతికీ...
4. ఇప్పటివరకూ నేను రాసిన నవలలన్నీ స్వీకరించి, రచయితగా నాకు జీవితాన్నిచ్చిన స్వాతి పత్రికకీ, వేమూరి బలరాం గారికీ...

5. 'సమన్వయ చక్రవర్తి ' శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారికీ...

6. శ్రీ కె.సుబ్బరామయ్య గారికీ (ఫిజిక్స్ ప్రొఫెసర్, SRKR Engg college, Bhimavaram)


హృదయ పూర్వక కృతజ్ఞతలు...

ఒక్కటే ఒక్క లోటు ఇప్పటికీ పీడిస్తోంది...




మా అమ్మకి డిటెక్టివ్ పుస్తకాలంటే చాలా ఇష్టం (అమ్మ దగ్గర్నుంచే నాకూ ఆ లక్షణం వచ్చింది)
ఈ నవల రాయటం పూర్తయ్యాకా, చదవమని మా అమ్మాగారికిస్తే, "ఇప్పుడొద్దురా...సస్పెన్సు నవలలు, సీరియల్లా చదివితేనే బాగుంటుంది...స్వాతిలో వచ్చినప్పుడు చదువుతాలే..." అంటూ ఉండేవారు. నా దురదృష్టం కొద్దీ, ఈ నవల మొదలయ్యేందుకు కొంచెం ముందే (6 Oct 2010) అమ్మ, అందరాని లోకాలకి వెళ్ళిపోయింది...ప్రతివారం స్వాతిలో సీరియల్ చూసినప్పుడల్లా అమ్మే గుర్తుకొచ్చి, కన్నులు జలపాతాలయ్యాయి...

ఈ సీరియల్ స్కాన్ చేసి, ఇక్కడ పెట్టాను. మీకు వీలున్నప్పుడు చదవండి.

https://drive.google.com/drive/folders/1f-ouFaWRYtwryfZmASvpZDVwxQLhsx7m?usp=sharing

Thursday, February 10, 2011

అమ్మోరి నవ్వు



అమ్మోరి నవ్వు


ఇది నేను రాసిన రెండో కధ (ప్రతిబింబాలు తరువాత)
అమ్మాయిలపై యాసిడ్ పోసేసి, "ప్రేమించిన అమ్మాయి దక్కకపోతే తట్టుకోలేక అలా చేశాం..." అని చెప్పుకునే అబ్బాయిల్ని చూస్తుంటే అసహ్యమేస్తుంది...

ప్రేమంటే, ప్రేమించిన అమ్మాయి పక్కనుండటమేనా?
పక్కన లేకపోతే మాత్రం, ఎప్పటికీ గుండెల్లో పదిలంగా ఉండదూ...?
కనులుమూసుకుని మనస్పూర్తిగా తల్చుకుంటే, కలల ముంగిట్లో వాలదూ?
ఆ విధంగా ఆలోచిస్తే,
ప్రేమించిన అమ్మాయి దూరమవ్వడమనేది అసలు సాధ్యమేనా?
నిజమైన ప్రేమలో ఎప్పటికీ కాదేమో...

అలా ఆలోచిస్తూండగా పుట్టిందీ కధ...
ఎందుకో గానీ చాలా ఎమోషనల్‌గా రాసేశాను...దాదాపు మూడేళ్ళ క్రితం...ఇప్పుడు చదువుతుంటే, ఈ కధని ఇంకా చాలా బాగా రాయచ్చని అనిపిస్తోంది...కానీ ఎందుకో సరిదిద్దడానికి చేతులు రావట్లేదు...రాయలేని తనాన్ని అలాగే పదిలంగా ఉంచుకోవాలనిపిస్తోంది...అందుకే ఈ కధ అలాగే వదిలేశా...

కానీ, ఈ కధ రాశాకా ఒక్క గుణపాఠం నేర్చుకున్నా...
పాత జ్ఞాపకాలతో ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ కధ రాసేయకూడదని (May hold good only for me, may not be for other writers)

Feb 2009 లో, రచన -కౌముది నిర్వహించిన కధల పోటీల్లో ఈ కధ ఎంపికయ్యింది.
Feb 2011 కౌముదిలో ప్రచురితమయ్యింది...
ఆ కధని ఇక్కణ్ణుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.....
http://www.scribd.com/doc/48622062